

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్: ఈ నెల 5 వ తేదీన హైదరాబాద్ లోని హైటెక్స్ లో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గ్రామ పాలన అధికారుల(జీపీఓ)కు నియామక పత్రాలు అందజేయబడతాయని, జీపీఓలుగా ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ కు వచ్చేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్ సూచించారు. జీపీఓ అభ్యర్థులు హైదరాబాద్ వెళ్ళడానికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్ మాట్లాడుతూ, జీపీఓలుగా ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 5 వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్న దృష్ట్యా, అభ్యర్థులకు ముందస్తు సమాచారం అందించి హైదరాబాద్ సకాలంలో చేరుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఆయా జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులలో వారిని నిర్ణీత సమయానికి తరలించాలని ఆదేశించారు. నియామకాలకు సంబంధించిన సమాచారాన్ని జిల్లాకు చెందిన మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలకు కూడా తెలియజేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రా రెడ్డి , జిల్లా రెవెన్యూ అధికారి సంగీత్ కలెక్టరేట్ ఏ.ఓ సునీల్, తదితరులు పాల్గొన్నారు.

