
ఆరోగ్యంగా ఉన్నా “సడన్ హార్ట్ ఎటాక్” ఎందుకు వస్తుంది? – నిపుణుల సమాధానమిదే!
రోజురోజుకు పెరుగుతున్న గుండెపోటు మరణాలు – ఈ అలవాట్లకు దూరంగా ఉండాలంటున్న నిపుణులు!
హైదరాబాద్, T6 న్యూస్ డెస్క్: నేటి రోజుల్లో మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయని నిపుణులు చెబుతున్నారు. శారీరకంగా ఫిట్‌గా ఉండి హైబీపీ, డయాబెటిస్ వంటి సమస్యలు లేకపోయినా హఠాత్తుగా గుండె ఆగిపోయి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నట్లు వెల్లడిస్తున్నారు. మరి ఈ సడన్ హార్ట్ ఎటాక్‌కు కారణాలు? తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గుండె లయ తప్పటం : గుండె కొట్టుకోవడానికి ప్రత్యేక విద్యుత్ వ్యవస్థ తోడ్పడుతుందని, ఇది అస్తవ్యవస్తమైతే గుండె కొట్టుకునే తీరు దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో గుండె చాలా వేగంగా లేదా నెమ్మదిగా కొట్టుకోవచ్చని, కొన్ని సార్లు పూర్తిగా ఆగిపోవచ్చని పేర్కొంటున్నారు. గుండె స్పందనల్లో ముఖ్యమైనవి వెంట్రిక్యులర్ టెకీకార్డియా, వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్. హఠాత్తుగా గుండె ఆగిపోవటానికి 99 శాతం వరకూ కారణం ఇవే అంటున్నారు. వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్‌లో గుండె కొట్టుకోవటమనేదే ఉండదని, విద్యుత్ వ్యవస్థలో షార్ట్ సర్క్యూట్ తలెత్తినట్టుగా గుండె ఆగిపోతుందని అంటున్నారు. ఇక టెకీ కార్డియాలో గుండె చాలా వేగంగా కొట్టుకుంటుందని, ఇది హఠాత్తు మరణానికి దారితీయదని, క్రమంగా వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్‌కు కారణమవుతుందని వివరిస్తున్నారు.
ఛాతీ నొప్పితో : రక్తనాళాల్లో పూడికలూ గుండె పోటుకు కారణం కావొచ్చని నిపుణులు అంటున్నారు. ఈ పూడికల వల్ల గుండెకు రక్త ప్రవాహం తగ్గుతుందని, దీంతో హార్ట్ ఎటాక్ సంభవిస్తుందని Mayoclinic ఓ అధ్యయనంలో పేర్కొంది. ఈ క్రమంలో హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్న వారిలో 50 శాతం మరణాలకు కారణం ఇదే అని చెబుతున్నారు. ఇలాంటి వారు సాధారణంగా ఛాతీ నొప్పి, అసౌకర్యం వంటి లక్షణాలు మొదలైన గంటలోపే కుప్పకూలుతున్నారని పేర్కొంటున్నారు.
సరిగా పనిచేయకపోవడం వల్ల : జన్యువుల్లో తేడాల వల్ల కొంత మందిలో కణస్థాయిలో సోడియం, పొటాషియం మార్గాల్లో లోపాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో గుండె విద్యుత్ వ్యవస్థ సరిగా పనిచేయక కుప్పకూలుతున్నారని వివరిస్తున్నారు. గుండె విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తమయ్యే వారికి కొన్ని రకాల మందులు, ముఖ్యంగా యాంటీహిస్టమిన్లు, అజిత్రోమైసిస్ వంటివి ప్రమాదకరంగా పరిగణించవచ్చని, ఇవి వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్‌ను ప్రేరేపిస్తాయని పేర్కొంటున్నారు.
వైరల్ ఇన్ఫెక్షన్ ప్రభావం : మయోకార్డిటిస్ అనే గుండె కండరాల వాపు వల్ల కూడా హఠాత్తుగా గుండెపోటు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందని, కొవిడ్ 19 తర్వాత ఈ సమస్య ఎక్కువ అయినట్లు అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్లు గుండెను బలహీనపరుస్తాయని, దీంతో అరిథ్మియాస్కు దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వివరిస్తున్నారు.
తీవ్ర వ్యాయామంతో : ఇతర భాగాల్లో ఏర్పడే రక్తం గడ్డలు గుండె రక్తనాళాలకు చేరుకోవటంతోనూ హఠాత్తుగా గుండె ఆగిపోవచ్చుని నిపుణులు అంటున్నారు. దీంతో పాటు రక్తంలో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాల మోతాదులు పడిపోవటమూ కారణం కావొచ్చుని చెబుతున్నారు.
అలాగే కొంత మంది తీవ్రమైన వ్యాయామం, శారీరక శ్రమ, ఆటలతోనూ గుండె విద్యుత్ వ్యవస్థ విఫలం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో దాదాపు 16% గుండెపోటు అకస్మాత్తుగా సంభవిస్తుందని US అధ్యయనంలో వెల్లడైంది. తీవ్రమైన వ్యాయామం హృదయ స్పందన రేటు, రక్తపోటు, అడ్రినలిన్ స్థాయిలను పెంచుతుందని, ఇది గుండెలో విద్యుత్ అవాంతరాలకు కారణమవుతుందని Indian Institute of Public Health ఓ అధ్యయనంలో పేర్కొంది. కానీ, కొందరిలో అప్పటికే వంశపారంపర్యంగా గుండె కండరం మందం కావటం వంటి గుండె సమస్యలు ఉంటాయని, ఇలాంటి వారు తీవ్రమైన శ్రమ చేసినప్పుడు అడ్రినలిన్ హార్మోన్ విడుదలై, విద్యుత్ వ్యవస్థ మీద విపరీత ప్రభావం పడుతుందని, ఫలితంగా హార్ట్ ఎటాక్ వస్తుందని అంటున్నారు.
ఇవీ కారణాలే:
అధిక కొవ్వు, మైదా పదార్థాలు : డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు, మైదాతో చేసిన పదార్థాలు తినడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుందని, దీంతో గుండెకు రక్తం సరఫరా చేసే ధమనులు మూసుకుపోయి, గుండెపోటుకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఈ అలవాట్లుతో : ధూమపానం, అతి మద్యపానం గుండెకు మంచిది కాదని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇవి గుండెపోటు రావడానికి ప్రధాన కారకాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొగతాగడం వల్ల రక్తనాళాలు దెబ్బతిని, రక్త ప్రసరణకు ఆటంకాలు ఏర్పడతాయని పేర్కొంటున్నారు. అలాగే అధికంగా మద్యం సేవించడం కూడా గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందంటున్నారు. అనారోగ్యకరమైన ఆహారం, పొగాకు వినియోగం, మద్యపానం, తక్కువ శారీరక శ్రమతో కూడిన జీవనశైలి హృదయ సంబంధ వ్యాధులకు ప్రధాన పాత్ర పోషిస్తాయని National Library of Medicine అధ్యయనంలో తేలింది.
ఇవి కూడా ప్రమాదమే : ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల బీపీ పెరిగి గుండెపై భారం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అధిక చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వివరించారు. నిరంతర ఒత్తిడి, సరిపడా నిద్ర లేకపోవడం కూడా గుండె సమస్యలకు దారితీయవచ్చుని పేర్కొంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

