
-బీసీ జాక్ ఇచ్చిన బంద్ ఫర్ జస్టిస్ కు మద్దతు తెలిపాం….
-బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర అధ్యక్షులు బెల్లపు దుర్గారావు
హైదరాబాద్,T6 న్యూస్: బిసి 42% రిజర్వేషన్లలో స్థానిక ఎన్నికల్లో ఏబిసిడి వర్గీకరణ చేసి అమలు చేయాలని బిసి ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు బెల్లపు దుర్గారావు అన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజాస్వామ్యంలో సమానత్వం కోసం బహుజన పోరాటం భారత రాజ్యాంగం యొక్క ఆత్మ సామాజిక న్యాయం అయితే, ఈ న్యాయం వాస్తవ జీవితాల్లోకి ప్రవేశించి, శతాబ్దాలుగా వెనుకబడిన వర్గాల యొక్క రాజకీయ, ఆర్థిక, విద్యా హక్కులకు తోడ్పాటు కావాలి. అందుకే రిజర్వేషన్లు కేవలం ఒక విధాన నిర్ణయం కాదు అవి సామాజిక విప్లవానికి పునాది. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం అంటే వారికి అధికారంలో భాగస్వామ్యం ఇవ్వడం. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు అనే వేరు వేరు పేర్లు ఉన్నా, చరిత్ర అంతకూడా ఒక్కటే. వారందరూ అణచివేత, వివక్ష, ఆధిపత్యానికి గురైన బహుజన సమాజం. ఆనాడు “మండల్ కమిషన్ ఉద్యమం – బహుజన చైతన్యానికి మార్గదర్శకం” 1979లో మొరార్జీ దేశాయి ప్రభుత్వం 42 అంశాలతో కూడిన మండల్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ దేశంలో ఉన్న సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడిన వర్గాల స్థితిని పరిశీలించి, వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా అవకాశాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని సిఫార్సు చేసింది. కానీ ఆ సిఫార్సులు సంవత్సరాల పాటు అమలు కాలేదు. అప్పుడు ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఇదే సమయానికి మన్యశ్రీ కాన్షీరామ్ గారు బహుజన శక్తిని ఐక్యపరిచే మహత్తర ఉద్యమాన్ని ముందుండి నడిపారు. ఆయన నాయకత్వంలో దేశమంతా ఒకే నినాదం మార్మోగింది. “మండల్ కమిషన్ అమల్ కరో, నహీతో కుర్చీ ఖాలి కరో” (మండల్ కమిషన్ అమలు చేయండి- లేదంటే కుర్చీ ఖాళీ చేయండి) ఈ నినాదం కేవలం ఒక రాజకీయ హెచ్చరిక కాదు అది అణగారిన ప్రజల శబ్దం, బహుజన చైతన్యానికి బాటనిచ్చిన స్వరం. కాన్షీరామ్ గారు పార్లమెంట్ ఎదుట ఆ నినాదంతో భారీ ధర్నా నిర్వహించి,దేశవ్యాప్తంగా బహుజన మేధావులు, విద్యార్థులు, కార్మికులు అందరినీ ఒకే వేదికపై నిలిపారు. ఈ ఉద్యమ ఫలితంగా, 1990లో వీ.పీ. సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ సిఫార్సులను పాక్షికంగా అమలు చేసింది. దాని ఫలితంగా దేశవ్యాప్తంగా ఓబిసి లకు విద్యా, ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు లభించాయి. ఇది కేవలం ప్రభుత్వ నిర్ణయం కాదు, బహుజన ఐక్యతతో సాధించిన సామాజిక న్యాయ విజయ గాధ.
నేడు తెలంగాణలో బీసీ రిజర్వేషన్ మరో పరీక్ష.
తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే ప్రయత్నం చేసింది. కానీ హైకోర్టు స్టే ఇచ్చింది. ఇది కేవలం చట్టపరమైన సమస్య కాదు సామాజిక న్యాయానికి మరో అడ్డంకి. ఈ సమయంలో ఎస్సీ, ఎస్టీ ప్రజలు, మేధావులు బీసీల పక్కన నిలబడి, సామాజిక న్యాయాన్ని రక్షించాలి. ఈ పోరాటం కుల పరమైనది కాదు ఇది రాజ్యాంగ పరమైన ప్రజాస్వామ్య పోరాటం. బహుజన ఐక్యత అంటే వర్గాల కలయిక కాదు, చైతన్యాల ఏకత్వం, బహుజన ఐక్యత అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వేర్వేరు సమస్యలు ఉన్నా, వారి లక్ష్యం ఒకటే సమానత్వం, స్వాభిమానం, మరియు న్యాయం. కాన్షీరామ్ చెప్పినట్లుగా “బ్రాహ్మణ్, బనియా, థాకూర్ లు ఐక్యమైతే, మనం ఎందుకు విడిపోయి ఉండాలి?” రాజకీయాల్లో బీసీ శక్తి పెరగడం అంటే, ఎస్సీ, ఎస్టీ శక్తి తగ్గడం కాదు, అది బహుజన ప్రజాస్వామ్య బలం పెరగడం.
మేధావులు వారి యొక్క బాధ్యత నిర్వర్తించే సమయం ఆసన్నమైంది.
ఇలాంటి సమయాల్లో మేధావుల మౌనం చాలా ప్రమాదకరం, న్యాయం కోసం పోరాటం జరుగుతున్నప్పుడు తటస్థంగా ఉండటం నేరం. మండల్ యుగంలో మేధావులు మాట్లాడారు ఇప్పుడు మళ్ళీ మాట్లాడాల్సిన సమయం వచ్చింది. మేధావులు వారి యొక్క బాధ్యత నిర్వర్తించే సమయం ఆసన్న మైంది. బీసీ రిజర్వేషన్ల పోరాటం కేవలం ఒక వర్గ హక్కు కాదు ఇది బహు జన సమాజం యొక్క రాజ్యాంగ హక్కు ఎస్సీ, ఎస్టీ ప్రజలు, మేధావులు బీసీల పక్కన నిలబడి మళ్ళీ ఒక కొత్త “మండల్ యుగం” ప్రారంభించాలి. ఈ పోరాటం యొక్క గమ్యం ఒకటే “సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య సమాన త్వం, బీసీ రిజర్వేషన్ల పోరాటానికి ఎస్సీ, ఎస్టీ ప్రజలు, మేధావులు మద్దతుగా నిలబడాలి” 18 నిర్వహించిన బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని బిసి జాక్ ఇచ్చిన పిలుపు బంద్ ఫర్ జస్టిస్ కు బీసీ ఫెడరేషన్ కులాల సమితి మద్దతు తెలిపి పాల్గొన్నాం అని తెలిపారు. బీసీ రిజర్వేషన్లలో స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వం బీసీలలో ఏబిసిడి వర్గీకరణ చేయాలనేది బిసి ఫెడరేషన్ కులాల సమితి లక్ష్యమన్నారు. దీనికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలుపాలని బిసి, ఎస్సీ, ఎస్టీ మేధావులను కోరారు.

