Headlines

వినాయక వ్రత విధానం

ఓం శ్రీ గురుభ్యోనమః
ఓం శ్రీ మహా గణాధిపతయే నమః
ఓం శనైశ్చరాయనమః

వినాయక చవితి రోజున ప్రాతఃకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తర్వాత తలంటు స్నానం చేసి ఉతికి వస్త్రాలను ధరించాలి. మామిడాకులు తోరణాలు కట్టి, ఇంటిని అలంకరించాలి . ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఓ పళ్లెంలో బియ్యంవేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. అగరువత్తులు వెలిగించి, దీపారాధన తర్వాత ఈ కింది మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ పూజను ప్రారంభించాలి.

ఓం దేవీంవాచ మజనయంత దేవాస్తాం విశ్వరూపా: పశవో వదంతి
సానో మంద్రేష మూర్జం దుహానాధే నుర్వాగాస్మానుప సుష్టుతైత్తు అయం ముహూర్తస్సుముహూర్తోస్తు

శ్లోకం: య శ్శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వ మంగళా తయో స్సంస్మరణా త్సుంసాం సర్వతో జయమంగళం అని చదవాలి. పీటపై వినాయక ప్రతిమను ఉంచి, పాలవెల్లికి పసుపు రాసి, కుంకుమతో బొట్టు పెట్టి విగ్రహం తలపై వచ్చేలా దాన్ని వేలాడదీయాలి. దీనిపై పత్రి వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు, పళ్లతో అలంకరించాలి. ఉండ్రాళ్లు, కుడుములు, పాయసం, గారెలు, పులిహోర, మోదకులు, జిల్లెడుకాయలు మొదలైన పిండివంటలు సిద్దం చేసుకోవాలి. రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకుని పసుపు రాసి, అందులో నీళ్లువేసి, పైన టెంకాయ, జాకెట్టు ఉంచి కలశం ఏర్పాటు చేయాలి.

పూజకు కావాల్సిన సామాగ్రి
పసుపు, కుంకుమ, గంధం, అగరవత్తులు, కర్పూరం, తమలపాకులు, పూలు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, బెల్లం, తోరం, కుందులు, నెయ్యి, నూనె, వత్తలు, 21 రకాల పత్రి, ఉద్దరిణ, నైవేద్యాలు.

ఓం కేశవాయ స్వాహాః, ఓం నారాయణాయ స్వాహాః, ఓం మాధవాయ స్వాహాః అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని ఆచమనం చేసుకోవాలి. అనంతరం
ఈ కింది శ్లోకాలను ఉచ్చరించాలి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీ కృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

ఈ కింది మంత్రాన్ని చెబుతూ కుడి చేతితో అక్షంతలు దేవునిపై చల్లాలి.
ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః, ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, ఓం శచీపురందరాభ్యాం నమః, ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః, ఓం శ్రీ సితారామాభ్యాం నమః, నమస్సర్వేభ్యోం మహాజనేభ్యః అయం ముహూర్త స్సుముహూర్తోస్తు

భూతోచ్చాటన
ఉత్తిష్టంతు భూతపిశాచా: ఏతే భూమి భారకా: ఏతాషామవిరోధేనబ్రహ్మకర్మ సమారభే మంత్రాన్ని చదువుతూ అక్షతలు తలపై నుంచి వెనుక వేసుకొవాలి.

ప్రాణాయామం: ఓం భూః, ఓం భువః, ఓగ్ సువః, ఓం మహాః, ఓం జనః, ఓం తపః, ఓగ్ సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్|, |ఓమా పోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్

అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపినా యః స్మరేద్వై విరూపాక్షంస బాహ్యాభ్యంతరశ్శుచిః అని నాలుగు దిక్కులా ఉద్ధరనితో నీళ్లు చల్లి శుద్ధిచేయాలి.

సంకల్పం:
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తే, శ్రీ మహావిష్ణోరాజ్ణాయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ: ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్ధక్షిణదిగ్భాగే, …….. నదీ సమీపే……… ( శ్రీ శైలస్య) నివాసిత గృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక, చాంద్రమానేన శ్రీ…………….నామ సంవత్సరే, …………… (దక్షిణాయనే), …….. (వర్ష) ఋతౌ, ……… (భాద్రపద) మాసే, ……… (శుక్ల) పక్షే,..….. (చతుర్థ్యాం) తిథి ………………. వాసరే, శుభ నక్షత్రే, శుభయోగే శుభకరణే, ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం, శుభతిధౌ శ్రీమాన్………… గోత్ర: ……….నామధేయ: ధర్మపత్నీ……………… సమేతోహం సకుటుంబస్య క్షేమస్ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్హ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్ధం సకలకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధ్యర్ధం, శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ముద్ధిస్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతాపూజాం కరిష్యే అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్ధం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే అంటూ కుడిచేయి ఉంగరం వేలితో నీళ్లు ముట్టుకోవాలి.

భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్ విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహంభజే
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవమ్ ధ్యాయేత్సిద్ధి వినాయకమ్
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం

షోడశోపచార పూజ
ధ్యాయేత్గజాననం దేవం తప్తకాంచనసన్నిభం, చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం.

శ్రీ మహా గణాధిపతయే నమః ధ్యాయామి

అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్బవ
ఆవాహయామి: మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతి గృహ్యాతాం.
ఆసనం సమర్పయామి: గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం.
ఆర్ఘ్యం సమర్పయామి: గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన.
పాద్యం సమర్పయామి: అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచమనం దేవ, తుభ్యం దత్తంమయా ప్రభో.
ఆచమనీయం సమర్పయామి: దధిక్షీర సమాయుక్తం థామద్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే.
మధుపర్కం సమర్పయామి: స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత.
పంచామృత స్నానం సమర్పయామి: గంగాదిసర్వతీర్థేభ్యః ఆహృతైరమలిర్ణలైః స్నానం కురుష్వభగవానుమాపుత్ర నమోస్తుతే.
శుద్దోదక స్నానం సమర్పయామి: రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ.
వస్త్రయుగ్మం సమర్పయామి: రాజితం బహ్మసూత్రంచ కాంచనం చో త్తరీయకం గృహాణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక.
ఉపవీతం సమర్పయామి: చంద నాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం.
గంధాన్ సమర్పయామి: అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్, గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే.
అక్షతాన్ సమర్పయామి: సుగంధాని సుపుష్పాణి జాజీకుంద ముఖానిచ ఏక వింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే.

పుష్పాణి పూజయామి: అథాంగ పూజ పుష్పాలతో పూజించాలి.

గణేశాయ నమః – పాదౌ పూజయామి
ఏకదంతాయ నమః – గుల్ఫౌ పూజయామి
శూర్పకర్ణాయ నమః – జానునీ పూజయామి
విఘ్నరాజాయ నమః – జంఘే పూజయామి
అఖువాహనాయ నమః – ఊరూ పూజయామి
హేరంబాయ నమః – కటిం పూజయామి
లంబోదరాయ నమః – ఉదరం పూజయామి
గణనాథాయ నమః – నాభిం పూజయామి
గణేశాయ నమః – హృదయం పూజయామి
స్థూలకంఠాయ నమః – కంఠం పూజయామి
గజవక్త్రాయ నమః – వక్త్రం పూజయామి
విఘ్నహంత్రే నమః – నేత్రం పూజయామి
శూర్పకర్ణాయ నమః – కర్ణౌ పూజయామి
ఫాలచంద్రాయ నమః – లలాటం పూజయామి
సర్వేశ్వరాయ నమః – శిరః పూజయామి
విఘ్నరాజాయ నమః – సర్వాణ్యంగాని పూజయామి
ఏకవింశతి పత్రపూజ

21 రకాల పత్రాలతో పూజించాలి.

సుముఖాయనమః – మాచీపత్రం పూజయామి।
గణాధిపాయ నమః – బృహతీపత్రం పూజయామి।
ఉమాపుత్రాయ నమః – బిల్వపత్రం పూజయామి।
గజాననాయ నమః – దుర్వాయుగ్మం పూజయామి
హరసూనవేనమః – దత్తూరపత్రం పూజయామి।
లంబోదరాయనమః – బదరీపత్రం పూజయామి।
గుహాగ్రజాయనమః – అపామార్గపత్రం పూజయామి।
గజకర్ణాయనమః – తులసీపత్రం పూజయామి,
ఏకదంతాయ నమః – చూతపత్రం పూజయామి,
వికటాయ నమః – కరవీరపత్రం పూజయామి।
భిన్నదంతాయ నమః – విష్ణుక్రాంతపత్రం పూజయామి,
వటవేనమః – దాడిమీపత్రం పూజయామి,
సర్వేశ్వరాయనమః – దేవదారుపత్రం పూజయామి,
ఫాలచంద్రాయ నమః – మరువకపత్రం పూజయామి,
హేరంబాయనమః – సింధువారపత్రం పూజయామి
శూర్పకర్ణాయనమః – జాజీపత్రం పూజయామి,
సురాగ్రజాయనమః – గండకీపత్రం పూజయామి,
ఇభవక్త్రాయనమః – శమీపత్రం పూజయామి,
వినాయకాయ నమః – అశ్వత్థపత్రం పూజయామి,
సురసేవితాయ నమః – అర్జునపత్రం పూజయామి।
కపిలాయ నమః – అర్కపత్రం పూజయామి।
శ్రీ గణేశ్వరాయనమః – ఏకవింశతి పత్రాణి పూజయామి.

అష్టోత్తర శత నామ పూజా
ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్వైమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీప్తాయ నమః
ఓం సుఖనిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబజఠరాయ నమః
ఓం హయగ్రీవాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం వాక్పతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం ఆశ్రితవత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బల్వాన్వితాయ నమః
ఓం బలోద్దతాయ నమః
ఓం భక్తనిధయే నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం భావాత్మజాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకరప్రభాయ నమః
ఓం సర్వాయ నమః
ఓం సర్వోపన్యాసాయ నమః
ఓం సర్వకర్త్రే నమః
ఓం సర్వనేత్రే నమః
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః
ఓం సర్వసిద్ధయే నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః
ఓం అక్షోభ్యాయ నమః
ఓం కుంజరాసుర భంజనాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థ పనసప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః
ఓం బ్రహ్మవిద్యాధిపాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్తజీవితాయ నమః
ఓం జితమన్మథాయ నమః
ఓం ఐశ్వర్యకారణాయ నమః
ఓం జ్యాయనే నమః
ఓం యక్షకిన్నరసేవితాయ నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం గణాధీశాయ నమః
ఓం గంభీరనినదాయ నమః
ఓం వటవే నమః
ఓం అభీష్టవరదాయినే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం భక్తనిధయే నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం మంగళప్రదాయ నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం అపాకృతపరాక్రమాయ నమః
ఓం సత్యధర్మిణే నమః
ఓం సఖ్యే నమః
ఓం సరసాంబునిధయే నమః
ఓం మహేశాయ నమః
ఓం దివ్యాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖలాయ నమః
ఓం సమస్తదేవతామూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విఘాతకారిణే నమః
ఓం విశ్వక్‌దృశే నమః
ఓం విశ్వరక్షాకృతే నమః
ఓం కళ్యాణ గురవే నమః
ఓం ఉన్మత్తవేషాయ నమః
ఓం అపరాజితే నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః
ఓం ఆక్రాన్తచిదచిత్ప్రభవే నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః

 శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి.

ధూపమ్ : (అగరువత్తులను వెలిగించి ఆ ధూపాన్ని గణపతికి కుడి చేతితో చూపించాలి. అంతేగాని అగరువత్తులను చుట్టూ తిప్పకూడదు)
దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం॥ఉమా సుత నమస్తుభ్యం గృహాణవరదో భవ॥శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ధూపమాఘ్రాపయామి.
దీపమ్ : (కర్పూర దీపాన్ని గాని, నేతి దీపాన్ని గాని కుడిచేతితో భగవంతునికి చూపాలి) స్వాజ్యంత్రివర్తి సంయుక్తం వహ్నినాద్యోతితం మయా గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే॥శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః దీపం దర్శయామి॥
నైవేద్యమ్ : (గణపతికి నివేదించాల్సిన అన్ని ఫలాలను, పిండి వంటలను పళ్లెంలో ఒక ఆకువేసి ఆ ఆకులో పెట్టి ఉంచాలి. వాటిపై ఈ క్రింది మంత్రంతో నీళ్ళు చల్లాలి)
ఓమ్ భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహి ధియోయనః ప్రచోదయాత్ ॥
(పుష్పంతో నీటిని పదార్థాల చుట్టూ తిప్పాలి)
ఓమ్ సత్యంత్వర్తేన పరిషించామి॥
ఓమ్ బుుతంత్వా సత్యేన పరిషించామి॥(రాత్రి అయితే)
సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం దేవచణముద్గైః ప్రకల్పితాన్‌ భక్ష్యం భోజ్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక॥శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మహానైవేద్యం సమర్పయామి. (పుష్పంతో నీటిని రెండుసార్లు పళ్లెంలో విడిచిపెట్టాలి)
ఓమ్ అమృతమస్తు! ఓమ్ అమృతోపస్తరణమసి॥
(అయిదుసార్లు ఎడమచేతితో కుడిమోచేయిని పట్టుకుని కుడి చేతితో గణపతివైపు నైవేద్యాన్ని చూపాలి) ఓమ్ ప్రాణాయ స్వాహా ఓమ్ అపానాయ స్వాహా ఓమ్ వ్యానాయ స్వాహా ఓమ్ ఉదానాయ స్వాహా ఓమ్ సమానాయ స్వాహా॥(తరువాత సమర్పయామి అన్నప్పుడల్లా పుష్పంతో పళ్ళెంలో నీళ్ళు వదలాలి) మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృతాపిధానమసి ఉత్తరాపోశనం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌప్రక్షాళయామి శుద్ధాచమనీయం సమర్పయామి॥
తాంబూలమ్ : (మూడు తమలపాకులు, వక్కలు, అక్షతలు, పుష్పం, ఫలం సుగంధ ద్రవ్యాలు, దక్షిణలతో తాంబూలాన్ని గణపతి వద్ద ఉంచాలి) పూగీఫలసమాయుక్తం నాగవల్లీదళైర్యుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్‌॥శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః తాంబూలం సమర్పయామి॥సదానంద విఘ్నేశ పుష్కలాని ధనాని చ భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక॥శ్రీ సిద్ధి బుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః సువర్ణ పుష్పం సమర్పయామి॥
నీరాజనమ్ : (హారతి కర్పూరాన్ని వెలిగించి ఆ దీపాన్ని తిప్పుతూ గణపతికి చూపించాలి) ఘృతవర్తిసహస్రైశ్చ కర్పూర శకలైస్తదా నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ॥సమ్రాజంచ విరాజంచ అభిశ్రీః యాచనోగృహే లక్ష్మీరాస్ట్య్ర యాముఖే తయామా సగ్‌ం సృజామసి॥సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళానిభవంతు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు॥శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః నీరాజనం దర్శయామి॥నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి॥(అని పుష్పంతో పళ్ళెంలో నీటిని విడవాలి)
మంత్రపుష్పమ్ : (ఇక్కడ మంత్రపుష్పాన్ని పెద్దదిగాని, చిన్నదిగాని చెప్పవలెను. రానివారు ఈ శ్లోకాలతో మంత్రపుష్పాన్ని సమర్పించాలి)

గణాధిప నమస్తేస్తు
ఉమాపుత్రా విఘ్ననాశన
వినాయకేశ తనయ సర్వసిద్ధి ప్రదాయక॥
ఏకదంతైక వదన తథా మూషికవాహన
కుమారగురవే తుభ్యమర్పయామి సుమాంజలిమ్‌॥
తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి
తన్నోదంతిః ప్రచోదయాత్‌॥
శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః
మంత్రపుష్పాంజలిం సమర్పయామి.

ఆత్మప్రదక్షిణ నమస్కారమ్ : (పువ్వులు, అక్షతలు తీసుకుని లేచి నిలబడి నమస్కారం చేయాలి. అంతేగాని తనచుట్టూ తాను తిరగకూడదు)
ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన॥
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మానాం పాపాత్మా పాపసంభవః
త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల
అన్యాధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్యభావేన రక్షరక్ష గణాధిప॥
శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః
ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

ప్రార్థన
(పుష్పాక్షతలతో ప్రార్థించి, తరువాత వాటిని గణపతి
పాదాల వద్ద ఉంచాలి)
నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన ఈప్సితం
మే వరం దేహి పరత్ర చ పరాంగతిమ్‌॥వినాయక నమస్తుభ్యం సతతం మోదకప్రియ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా॥అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా పుత్రోయమితి మామత్వా క్షమస్వ గణనాయక॥
శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః
ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి॥

సాష్టాంగ నమస్కారమ్
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పాదాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే॥శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి॥
శ్లో॥ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపతి యత్పూజితం
మయాదేవ పరిపూర్ణంతదస్తుతే అనేన పూజావిధానేన శ్రీ మహాగణాధిపతి
సుప్రీత స్సుప్రసన్నో వరదోభవతు.
(నేను చేసిన పూజలో మంత్రలోపము, క్రియాలోపము, భక్తి లోపము ఉన్నను అవన్నీ మన్నించి గణపతి దేవా పరిపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించుము.
అపరాధ ప్రార్థన : (రెండు చేతులు జోడించి గణపతికి నమస్కరించి, చెంపలు వేసుకోవాలి) అపరాధ సహస్రాణి క్రియంతేహం అహర్నిశా పుత్రోయమితి మామత్వా క్షమస్వ గణనాయక॥ఆవాహనం నజానామి నజానామి విసర్జనం పూజాంచైవ నజానామి క్షమ్యతాం గణనాయక॥శ్రీ వరసిద్ధి బుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః అపరాధ నమస్కారాన్ సమర్పయామి॥
(ఈ కింది మంత్రాలను చెబుతూ కొన్ని అక్షింతలు చేతిలో తీసుకొని నీటితో పళ్లెంలో విడిచిపెట్టాలి)
అనేన మయాకృతేన కల్పోక్త ప్రకారేణ గణపతి అష్టోత్తర శతనామ సహిత యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజానేన భగవాన్ సర్వాత్మకః శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామిన్ సుప్రీతః సుప్రసన్నః వరదో భవతు.

కథ చదివేవారు వినేవారు అందరూ అక్షతలు చేతిలో వుంచుకొని కథ వినాలి)

సూతమహాముని శౌనకాది మునులకు విఘ్నేశ్వరో త్పత్తియు, చంద్రదర్శన దోషకారణంబును, తన్నివారణ మును చెప్పదొడంగెను.
పూర్వము గజరూపముగల రాక్షసేశ్వరుండు శివుని గూర్చి ఘోర తపంబొనర్చెను. అతని తపమునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరంబు కోరుకోమనెను. అంత గజాసురుండు పరమేశ్వరుని స్తుతించి, స్వామీ! నీవెల్లప్పుడు నా యుదర మందు వసించియుండుమని కోరెను. భక్త సులభుండగు నా పరమేశ్వరుండాతని కోర్కెదీర్చి గజాసురుని యుదరమందు ప్రవేశించి సుఖంబుననుండెను.
కైలాసమున పార్వతీదేవి భర్త జాడ తెలియక పలుతెరంగుల నన్వేషించుచు కొంత కాలమునకు గజాసుర గర్భస్థుడగుట తెలిసికొని రప్పించుకొను మార్గముగానక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతి వృత్తాంతము తెలిపి, ‘‘మహాత్మా! నీవు పూర్వము భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నాకు యొసంగితివి, ఇప్పుడు కూడా నుపాయాంతరముచే నా పతిని రక్షింపుము’’ అని విలపింప, శ్రీహరి యా పార్వతి నూరడించి పంపె. అంత నా హరి బ్రహ్మాదిదేవతలను పిలిపించి, గజాసుర సంహారమునకు గంగి రెద్దుమేళమే యుక్తమని నిశ్చయించి, నందిని గంగిరెద్దుగా నలంకరించి, బ్రహ్మాదిదేవతలందరిచేతను తలొక వాద్యమును ధరింపజేసి, తానును చిరుగంటలు, సన్నాయిలు దాల్చి గజాసురపురంబు జొచ్చి జగన్మోహనంబుగా నాడించు చుండగా, గజాసురుండు విని వారలను తన చెంతకు పిలిపించి తన భవనమందు నాడింప నియోగించెను. బ్రహ్మాదిదేవతలు వాద్య విశేషంబుల బోరు సలుప జగన్నాటక సూత్రధారియగు నా హరి చిత్ర విచిత్ర కరంబుగ గంగిరెద్దును ఆడించగా, గజాసురుండు పరమానంద భరితుడై ‘‘మీకేమి కావలయునో కోరుడొసంగెద’’ ననిన, హరి వానిని సమీపించి, ‘‘ఇది శివుని వాహనమగు నంది’’ శివుని కనుగొనుటకై వచ్చె కావున శివునొసంగు’’ మనెను.
ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి, అతనిని రాక్షసాంతకుడగు శ్రీహరిగా నెరింగి, తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తన గర్భస్థుండగు పరమేశ్వరుని
‘‘నా శిరసు త్రిలోకపూజ్యముగా జేసి, నా చర్మము నీవు ధరింపు’’ మని ప్రార్థించి విష్ణుమూర్తికి అంగీకారము తెలుప నాతడు నందిని ప్రేరేపించెను. నందియు తన శృంగములచే గజాసురుని చీల్చి సంహరించెను. అంత శివుడు గజాసుర గర్భము నుండి బహిర్గతుడై విష్ణుమూర్తిని స్తుతించెను. అంత నా ‘‘హరి దుష్టాత్ములకిట్టి వరంబు లీయరాదు… ఇచ్చినచో పామునకు పాలుపోసినట్లగు’’నని ఉపదేశించి బ్రహ్మాది దేవతలను వీడ్కొలిపి తాను వైకుంఠమున కేగెను. శివుడు నంది నెక్కి కైలాసమున కతివేగంబున జనియె.

వినాయకోత్పత్తి

కైలాసంబున పార్వతీదేవి భర్త రాకను దేవాదుల వలన విని ముదమంది అభ్యంగన స్నానమాచరించుచు నలుగుబిండితో నొక బాలునిగ జేసి, ప్రాణం బొసగి, వాకిలి ద్వారమున కాపుగా నుంచెను. స్నానానంతరము పార్వతి సర్వాభరణముల నలంకరించుకొనుచు పత్యాగమునమును నిరీక్షించుచుండె. అపుడు పరమేశ్వరుడు నంది నధిరోహించి వచ్చి లోపలికి పోబోవ వాకిలి ద్వారముననున్న బాలుడడ్డగించెను. శివుడు కోపించి త్రిశూలముతో బాలుని కంఠంబు దునిమిలోనికేగెను.
అంత పార్వతీదేవి భర్తనుగాంచి, ఎదురేగి, అర్ఘ్యపాద్యాదులచే పూజించె, వారిరువురును పరమానందమున ప్రియభాషణములు ముచ్చటించుచుండ ద్వారమందలి బాలుని ప్రసంగము వచ్చె. అంత నమ్మహేశ్వరుండు తానొనరించిన పనికి చింతించి, తాను తెచ్చిన గజాసుర శిరంబును బాలునికతికించి ప్రాణంబు నొసంగి ‘‘గజాననుడు’’ అని నామం బొసంగె. అతనిని పుత్ర ప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొనుచుండిరి. గజాననుడు తల్లిదండ్రులను పరమభక్తితో సేవించు చుండెను. అతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింద్యుడను నొక ఎలుక రాజును వాహనముగా జేసికొనెను.
కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వురులకు కుమారస్వామి జనియించెను. అతడు మహాబలశాలి. అతని వాహనరాజము నెమలి. దేవతల సేనానాయకుడై ప్రఖ్యాతిగాంచి యుండెను.

#విఘ్నేశాధిపత్యము
ఒకనాడు దేవతలు, మునులు పరమేశ్వరుని సేవించుచు విఘ్నముల కొక్కని అధిపతిగా తమ కొసంగుమని కోరిరి. గజాననుడు తాను జ్యేష్ఠుడు గనుక అయ్యాధిపత్యము తనకొసంగు మనియు, ‘‘గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు గనుక అయ్యాధిపత్యము తన కొసంగు’’ మని కుమారస్వామియు తండ్రిని వేడుకొనిరి.
శివుండక్కుమారులను జూచి, ‘‘మీలో నెవ్వరు ముల్లోకము లందలి పుణ్యనదులలో స్నానమాడి ముందుగా నా యొద్దకు వచ్చెదరో, వారికీయాధిపత్యం బొసంగుదు’’ నని మహేశ్వరుండు పలుక, వల్లెయని సమ్మతించి కుమారస్వామి నెమలి వాహనంబు నెక్కి వాయు వేగంబున నేగె. అంత గజాననుడు ఖిన్నుడై, తండ్రిని సమీపించి ప్రణమిల్లి ‘‘అయ్యా! నా అసమర్థత తామెరింగియు నిట్లానతీయ దగునే!
నీ పాదసేవకుడును నాయందు కటాక్షముంచి తగు నుపాయంబుదెల్పి రక్షింపవే’’ యని ప్రార్థింప, మహేశ్వరుడు దయాళుడై, కుమారా! ఒకసారి ‘‘నారాయణ మంత్రంబు పఠించు’’ మని ఆ నారాయణ మంత్రాన్ని ఉపదేశించె.
‘‘సకృత్ నారాయణేత్యుక్త్యాపుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక’’
అంత గజాననుడు సంతసించి, అత్యంత భక్తితో నమ్మంత్రంబు జపించుచు కైలాసంబున నుండె.

అమ్మంత్ర ప్రభావంబున అంతకు పూర్వము గంగానదికి స్నానమాడనేగిన కుమారస్వామికి గజాననుండా నదిలో స్నానమాడి తన కెదురుగా వచ్చుచున్నట్లు గాన్పింప, నతండును మూడు కోట్ల ఏబది లక్షల నదులలో కూడ అటులనే చూచి ఆశ్చర్యపడుచు, కైలాసంబున కేగి తండ్రి సమీపమందున్న గజాననుని గాంచి, నమస్కరించి, తన బలమును నిందించుకుని ‘‘తండ్రీ! అన్నగారి మహిమ తెలియకట్లంటిని క్షమింపుము. ఈ ఆధిపత్యంబు అన్నగారికే యొసంగు’’ మని ప్రార్థించెను.
అంత పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధ చతుర్థినాడు గజాననునికి విఘ్నాధిపత్యం బొసంగబడియె. ఆనాడు సర్వదేశస్తులు విఘ్నేశ్వరుని తమ విభవముల కొలది కుడుములు, అప్పములు మున్నగు పిండివంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటి పండ్లు, పానకము, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజింప, విఘ్నేశ్వరుండు సంతుష్టుడై కుడుములు మున్నగునవి భక్షించియు, కొన్ని వాహనమున కొసంగియు, కొన్ని చేత ధరించియు మందగమనంబున సూర్యాస్తమయం వేళకు కైలాసంబున కరిగి తల్లిదండ్రులకు ప్రణామంబు సేయబోవ ఉదరము భూమి కానిన చేతులు భూమి కందవయ్యే, బలవంతంబుగ చేతులానిన చరణంబులాకాశంబు జూచె, ఇట్లు దండ ప్రణామంబుసేయ గడు శ్రమనొందుచుండ, శివుని శిరంబున వెలయు చంద్రుడు జూచి వికటంబుగ నవ్వె, అంత ‘రాజదృష్టి’ సోకి నరాలుకూడ నుగ్గగు నను సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి అందున్న కుడుములు తత్ప్రదేశంబెల్లెడల దొర్లెను. అతండును మృతుండయ్యె, పార్వతి శోకించుచు చంద్రుని జూచి,

బుషిపత్నులకునీలాపనిందలు

‘‘పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించెను గాన, నిన్ను చూచినవారు పాపాత్ములై నీలాపనిందలు నొందుదురుగాక’’ అని శపించెను. ఆ సమయంబున సప్తమహర్షులు యజ్ఞంబు చేయుచు తమ భార్యలతో ప్రదక్షిణము చేయుచుండిరి. అగ్నిదేవుడు ఋషి పత్నులను చూచి మోహించి శాప భయంబున అశక్తుడై క్షీణించు చుండగా, నయ్యది అగ్ని భార్యయగు స్వాహాదేవి గ్రహించి అరుంధతీ రూపము దక్క తక్కిన ఋషిపత్నుల రూపంబు తానే దాల్చి పతికి ప్రియంబు చేసె, ఋషులద్దానింగనుగొని అగ్నిదేవునితో నున్నవారు తమ భార్యలేయని శంకించి తమ భార్యలను విడనాడిరి. పార్వతీ శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వారికట్టి నీలాపనింద కలిగినది.
ఋషిపత్నుల యాపద పరమేష్టికి దెల్ప నాతండు సర్వజ్ఞుండగుటచే అగ్నిహోత్రుని భార్యయే ఋషి పత్నుల రూపంబు దాల్చి వచ్చుటం దెల్పి సప్త ఋషులను సమాధానపరచె. వారితో కూడా బ్రహ్మ కైలాసంబున కేతెంచి, ఉమామహేశ్వరుల సేవించి మృతుడై పడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబుగూర్చె.
అంత దేవాదులు, ‘‘ఓ పార్వతీ దేవి! నీ శాపంబున లోకంబులకెల్ల కీడు వాటిల్లుచున్నది. దాని నుపసంహరింపు’’ మని ప్రార్థింప, పార్వతి సంతసించి, ‘‘ఏ దినంబున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో నా దినంబున చంద్రుని జూడరాద’’ ని శాపోపశమనంబునొసంగె, అంత బ్రహ్మాదులు సంతసించి తమ గృహంబులకేగి, భాద్రపద శుద్ధ చతుర్థియందు మాత్రము చంద్రుని జూడక జాగరూకులై సుఖంబుగ నుండిరి.

#శ్యమంతకోపాఖ్యానము

యదువంశమునందు సత్రాజిత్తు, ప్రసేనుడు అను సోదరులుండిరి. వారు నిఘ్నని కుమారులు. సత్రాజిత్తునకు సూర్యభగవానుడు మిత్రుడు. ఒకనాడు సత్రాజిత్తు సూర్యభగవానుని స్తుతించెను. తదేక మనస్కుడై సత్రాజిత్తు చేసిన స్తుతికి ప్రసన్నుడై సూర్యభగవానుడు అతనికి ప్రత్యక్షమయ్యెను. అంతట సత్రిజుత్తు సూర్యునకు ప్రణామములు చేసి స్తుతించెను. ప్రసన్నుడైన సూర్యుడు వరమును కోరుకొనమనెను. అంతట సత్రాజిత్తు సూర్యుని నుండి ‘‘శ్యమంతకమణి’’ని కోరెను. అది విని సూర్య భగవానుడు శ్యమంతకమణిని తన కంఠం నుండి తీసి సత్రాజిత్తునకు ఇచ్చెను. ఆ సమయమున సూర్యుడు సత్రాజిత్తుతో ఇట్లు పలికెను. ఆ దివ్యమణిని పవిత్రుడై ధరించినచో ప్రతిదినమా మణి ఎనిమిది బారువుల బంగారము ననుగ్రహించును. ఆ మణియున్ను దేశమున అనావృష్టి, ఈతిబాధలు, అగ్ని, వాయు, విషక్రిములచే ఉపద్రవములు, దుర్భిక్షము మొదలగునవి వుండవు. కానీ అశుచియై ధరించినచో అది ధరించిన వానిని చంపును. ఈ విషయ ములను తెలిసికొని, సత్రాజిత్తు సూర్యుని నుండి మణిని గ్రహించి, ధరించి, పురవీధులలో నడిచి వచ్చుచుండగా చూసిన పౌరులు దాని కాంతికి భ్రమించి సూర్యభగవానుడే శ్రీకృష్ణదర్శనమునకై వచ్చుచున్నాడని భావించి, ఆ విషయము శ్రీ కృష్ణునకు నివేదించిరి. శ్రీ కృష్ణుడు అట్టి రత్నము ప్రభువు వద్ద ఉన్నచో దేశాభివృద్దికి, ప్రజా సంక్షేమమునకు ఉపయోగపడునని ఆ మణిని ప్రభువైన ఉగ్రశేనునికి ఇప్పింప సంకల్పించెను.
కానీ సత్రాజిత్తు నిరాకరించెను. కృష్ణుడు సరే లెమ్మని మిన్న కుండెను.
ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనజిత్తు అశుచిగా ఉండి కూడా ఆ దివ్య మణిని ధరించి అడవికి వెళ్లెను. కొంత సమయమునకు ఒక సింహము మణిని ఏదో తిను భండారముగా భ్రమించి ప్రజేనజిత్తును చంపి దానిని నోట కరచుకొని పోవుచుండ జాంబవంతుడు అనే భల్లూకం ఆ సింహాన్ని సంహరించి ఆ మణిని తన కూతురైన జాంబవతికి క్రీడా వస్తువుగా ఉయ్యాలకు కట్టెను. దానికి పూర్వము, దేశ ప్రయోజనాల కొరకై ఆ మణిని శ్రీ కృష్ణుడు కోరిన కారణము చేత, అతడే ప్రసేనుని చంపి మణినపహరించెనని సత్రాజిత్తు, పౌరులు, భావించిరి. దీనికి కారణము ఒకానొక వినాయక చవితి రోజున పాలలో చంద్రబింబమును కృష్ణుడు చూచి యుండుటయేకారణ మని ఆ అపవాదును బాపుకొనుటకై, శ్రీకృష్ణుడు మరునాడు, అడవిలో శోధింపగా ఎముకలు, చిరిగిన బట్టలు, తెగిపడిన ఆభరణములు కనబడెను, దానిని ప్రసేనుని గుర్రమును ఏదో కూృరమృగము చంపి ఉండునని కృష్ణుడు భావించెను. అచ్చట గుర్రపు పాదముద్రలు ఆగిపోయి, ఒక సింహపు పాదముద్రలు కనబడెను. శ్యమంతకమణి మాత్రము దొరకలేదు. కాని కృష్ణుని వెంట వచ్చిన సత్రాజిత్తు సన్నిహితులు, కృష్ణుడే ముందటి రోజు ప్రసేనుని సంహరించి, శ్యమంతకమణిని అపహరించెననియు. రాత్రి వేళ సింహము ప్రసేనుని, అతని గుర్రమును తిని యుండునని నిష్టూరముగా పలికిరి.

ఈ అపవాదు నుండి తప్పించుకొనుటకై శ్రీ కృష్ణుడు మరింత ప్రయత్నము ప్రారంభించెను. కొంత దూరము వెళ్ళగా అచట సింహపు కళేబరము కనబడెను. అచ్చటినుండి భల్లూకపు పాదముద్రలు కనబడెను. వాని ననుసరించి వెళ్ళి ఒక గుహలోనికి ప్రవేశించెను. అచ్చట యవ్వనమునందున్న ఒక యింతి ఊయల ఊపుచుండెను. ఊయల పై ఆట వస్తువుగా శ్యమంతకమణి కట్టబడి ఉండెను. ఊయల ఊపుచున్న ఆ లలనయే జాంబవతి. ఆమె కృష్ణుని చూచి ఆయన సౌందర్యమునకు వశపడి, బహుశః ఆయన శ్యమంతకమణికై వచ్చెనని భావించి, గట్టిగా మాట్లాడినచో తన తండ్రి జాంబవంతుడు వచ్చి శ్రీ కృష్ణునకేమైనా ఆపద కల్పించునేమోనని భీతిచెంది, పాటపాడుచున్న దాని వలె ఆ శ్యమంతకమణి వచ్చిన విధమునిట్లు చెప్చెను.
శ్లో॥ సింహః ప్రసేనమవధీః
సింహో జాంబవతాహతాః
సుకుమారక మారోధీః
తవ హ్యేష శ్యమంతకః
తా॥ప్రసేనుని వధించిన సింహమును జాంబవంతుడు వధించి, శ్యమంతకమణిని తెచ్చెను. ఓ సుకుమారుడా!
ఈ మణి నీకే ఏడవకుము.
అంతలో లోపల నిద్రించుచున్న జాంబవంతుడు లేచి వచ్చి, శ్యమంతకమణి కొరకై శ్రీ కృష్ణుడు వచ్చెనని శంకించి, ద్వంద యుద్దమునకు తలపడెను. ఆ కృష్ణుడే రామావతార కాలమున జాంబవంతునికి చిరంజీవిగా వరమిచ్చెను. ఆ కాలమున జాంబంవంతునకు రాముని ఆలింగనమొనర్చుక ొనవలెనని కోర్కె యుండెడిది. కాని కృష్ణుడు ఆ కోర్కెనిప్పుడు తీర్చుటకై జాంబవంతునితో ఇరవైయొక్క (21) రోజుల పాటు యుద్దమొనర్చెను.
తదుపరి ఈ శ్రీకృష్ణుడే ఆ నాటి తన దైవం రాముడని తెలుసుకొని శ్యమంతకమణిని దానితో పాటు తన కూతురు జాంబవతిని కృష్ణునకు జాంబవంతుడు సమర్పించుకున్నాడు. ఆ తదుపరి కృష్ణుడు శ్యమంతక మణిని సత్రాజిత్తుకు ఇవ్వగా తన పొరపాటు గ్రహించి సత్రాజిత్తు తిరిగి మణిని సత్యభామను శ్రీకృష్ణునికి సమర్పించారు..
అలా శ్యమంతకోపాఖ్యానం ద్వారా ఆ పరమాత్మ జాంబవతిని సత్యభామను వివాహ మాడిరి . ఈ కథను విన్న వారికి చదివిన వారికి ప్రవచించిన వారికి ఆ విఘ్నేశ్వరుని కరుణాకటాక్షములు ఎల్ల వేళలా ప్రసరించును.

Please follow and like us:
Pin Share