
రంగారెడ్డి: చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం మూర్తుజగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన 33/11 KV సబ్ స్టేషన్ ను సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ప్రాంతానికి రూ.20 కోట్ల నిధులతో 5 సబ్ స్టేషన్ లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. పట్టణీకరణ,పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చే అవకాశం ఉన్నందున ఈ ప్రాంతానికి 132 కేవీ సబ్ స్టేషన్ అవసరం ఉంటుందని స్థానిక ప్రజాప్రతినిధుల కోరిక మేరకు త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తూ, ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. రాబోయే 2047 వరకు డిమాండ్ కు అనుగుణంగా కేవలం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లే కాకుండా గ్రీన్ ఎనర్జీ ని పెద్ద ఎత్తున ఉత్పతి చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ సిస్టమ్ పెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశాలు జారీ చేశామన్నారు. దీంతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాలు, కస్తూర్బా పాఠశాలల్లో 100 శాతం సోలార్ ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. అలాగే ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా రక్షించడంతో పాటు అనువైన భూముల్లో రాష్ట్రానికి కావాల్సిన విద్యుత్ ను సోలార్ ద్వారా ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. మౌంటెన్ సోలార్ ఒక్కటే కాకుండా నీటి పారుదల ప్రాజెక్టుల్లో కూడా ఫ్లోటింగ్ సోలార్ ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళిక రచించాలని ఇరిగేషన్ శాఖకు లేఖ రాశామని ఆయన అన్నారు. గ్రీన్ ఎనర్జీని కొంత శాతం పరిశ్రమల్లో వినియోగించాలని, తద్వారా ఉత్పత్తి చేసే వస్తువులను మార్కెటింగ్ చేసుకునే అవకాశాన్ని అభివృద్ధి చెందినప్రపంచ దేశాలు ఆహ్వానిస్తున్నాయి కాబట్టి మన రాష్ట్రంలో వచ్చే పరిశ్రమలకు గ్రీన్ ఎనర్జీని అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా సబ్ స్టేషన్ ల అప్ గ్రేడ్ చేసుకోవడం, ట్రాన్స్ఫార్మర్స్ పెంచుకోవడం జరుగుతుందని, ఇవ్వాల 2 వేల మెగావాట్ల పైబడి డిమాండ్ పెరిగినప్పటికీ ఎక్కడ కూడా చిన్న విద్యుత్ కోత సమస్య లేకుండా సరఫరా చూస్తున్నామని ఆయన చెప్పారు. విద్యుత్ శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగికి ప్రభుత్వం కోటి రూపాయలతో ఇన్సూరెన్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం 95 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం అందజేస్తున్నామని, ప్రభుత్వంపై రూ.13,500 కోట్ల భారం పడుతున్నా ప్రజల సంక్షేమం కోసం ఉత్సవంలా సన్నబియ్యం పంపిణీ చేపడుతున్నామని ఆయన అన్నారు. జిల్లాలో కొత్తగా రేషన్ కార్డులలో 1 లక్షా 92 వేల 444 మందిని అదనంగా చేర్చామని, 31,005 కొత్త రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. బియ్యం పంపిణీతో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రాష్ట్రంలో 29 లక్షల వ్యవసాయ పంపుసేట్లకు కూడా 200 యూనిట్లు విద్యుత్ ఇస్తున్నామని, సంవత్సరానికి రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా వైద్యం చేసుకోవడానికి అవకాశం కల్పించామని, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ఒక్కో స్కూల్ ను 25 ఎకరాల్లో ఏర్పాటుకు చేయనుందని, ఒకే సంవత్సరంలో 104 స్కూల్స్ మంజూరు చేసిందని అన్నారు.ఇల్లు లేని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ముఖ్యమంత్రి తో పాటు క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని, నేడు ప్రతి నియోజకవర్గంలో 3500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4లక్షల 50 వేల ఇండ్లను 22,500 కోట్లతో మంజూరి తీసుకున్నామని వివరించారు. అనంతరం మండలంలో మంజూరైన లబ్ధిదారులకు ఉప ముఖ్యమంత్రి రేషన్ కార్డులు అందజేశారు.కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, TUFIDC చైర్మన్ చల్లా నరసింహ రెడ్డి, జిల్లా కలెక్టర్ సీ.నారాయణరెడ్డి, TSSPDCL చైర్మన్ ముషారఫ్ అలీ ఫరూఖీ, చేవెళ్ల RDO చంద్రకళ, మొయినాబాద్ తహసీల్దార్ గౌతం కుమార్, ఇతర అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

