
రంగారెడ్డి,T6న్యూస్: జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు సంబంధించిన పెండింగ్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
బుధవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ కార్యాలయం నుండి హౌసింగ్ విద్యుత్, ఆర్డబ్య్లూఎస్ అధికారులు, ఆర్డీఓలు, తహశీల్దార్లు మరియు ఎంపీడీఓలతో డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపు మరియు పెండింగ్ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, డబుల్ బెడ్ రూం ఇళ్లకు ఇప్పటికే ఎంపికైన లబ్ధిదారులకు కేటాయింపు ఇవ్వడానికి స్థానిక ప్రజా ప్రతినిధులతో అధికారులు సమన్వయం చేసుకోవాలని అన్నారు. విద్యుత్ సంబంధిత పనులతో పాటుగృహ సముదాయాలలో నీటి సరఫరా సంపుల నిర్మాణాన్ని పూర్తి చేసి, 15 రోజుల్లోగా లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, పిడి హౌసింగ్, విద్యుత్, ఆర్.డబ్ల్యూఎస్ అధికారులకు కలెక్టర్ సూచించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హౌసింగ్ పిడి నాయక్, విద్యుత్ అధికారులు, ఆర్.డబ్ల్యూఎస్ అధికారులు, సంబంధిత అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

