
హైదరాబాద్,T6 న్యూస్, ఆగస్ట్ 6: పంబాల కులానికి ప్రత్యేకమైన సంప్రదాయ కళా రూపమైన పంబ కళపై నేరేడుగొమ్ము మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన పంబాల పర్వతాలు జరిపిన లోతైన పరిశోధనకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి విశేష అభినందనలు లభించాయి. పంబాల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక స్థితిగతులను సాంప్రదాయ కళల దృష్టికోణంలో విశ్లేషిస్తూ, ఈ పరిశోధన నూతన కోణాన్ని ప్రతిపాదించింది.
ఎన్నో ఏండ్లుగా నిర్లక్ష్యానికి గురైన పంబాల వారు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రంగా తీసుకుని, పర్వతాలు పేదరిక నిర్మూలన, ఆహార భద్రత, నాణ్యమైన విద్య మరియు శాశ్వత పరిష్కారాల వంటి అంశాలను విశ్లేషించారు.
పంబ కళలను ప్రోత్సహించే కార్యక్రమాల ద్వారా పంబాల వంటి వెనుకబడిన కులాలకు ఆదాయ వనరులు కలిగే అవకాశం ఉందని, తద్వారా వారసత్వ కౌశల్యాలు కాపాడబడతాయని ఈ పరిశోధనలో పేర్కొనబడింది. ఆర్థిక స్థిరత పెరిగితే పౌష్టికాహార సమస్యలు తగ్గిపోతాయని, విద్యా అవకాశాలు పెరిగితే సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు. పట్టణీకరణ నేపథ్యంలో వంశ పారంపర్యంగా వస్తున్న కళలు రూపాంతరం చెందుతున్న పరిస్థితిలో, వాటిని రక్షించటం అత్యవసరమని ఈ పరిశోధన సూచిస్తోంది.
ఈ పరిశోధనను పూర్తిగా పరిశీలించిన అనంతరం, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బి. జె. రావు గారు “ఈ అధ్యయనం ప్రజల జీవనవిధానాన్ని, వారసత్వ కళలను అభివృద్ధి లక్ష్యాల దృష్టిలో నిలుపుతూ చేసిన అరుదైన ప్రయత్నం” అని ప్రశంసించారు. తెలుగు శాఖాధ్యక్షులు ప్రొఫెసర్ పిల్లలమర్రి రాములు గారు ఈ పరిశోధనను “సాంప్రదాయ కళల పరిరక్షణకు మార్గదర్శిగా నిలుస్తుంది” అని అభివర్ణించారు.
పరిశోధనకు పర్యవేక్షకులుగా వ్యవహరించిన డా. దార్ల వెంకటేశ్వరరావు గారు ఈ అధ్యయనం “విచారశీల అధ్యయనాలకు ఓ మైలురాయి” అని అభిప్రాయపడ్డారు.
దక్షిణ భారతదేశంలో పర్యటించి నిబద్ధతతో ఈ పరిశోధనను పూర్తి చేసినందుకు పర్వతాలను విశ్వవిద్యాలయ వర్గాలు హృదయపూర్వకంగా అభినందించాయి.
సాంప్రదాయ కళలను ఆధారంగా తీసుకుని సమాజ అభివృద్ధిలో వాటి పాత్రను ఆవిష్కరించే ఈ తరహా పరిశోధనలు, అట్టడుగు వర్గాల చైతన్యానికి ప్రేరణగా నిలవనున్నాయని విద్యావేత్తలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

