Headlines

స్వశక్తిని చాటండి.. కోటి వెలుగులు అందుకోండి..

మహిళలతో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు

అసెంబ్లీ పరిధిలో 3,418 చెక్కులు అందజేత..

చెక్కుల విలువ 3.29 కోట్లు..

మంత్రికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి, నాయకులు..

కార్యక్రమానికి హాజరైన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి

జోరుగా.. హుషారుగా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం

రంగారెడ్డి,షాద్ నగర్ : ప్రభుత్వం అన్ని రంగాలలో మహిళలకే పెద్ద పీట వేసింది.. ఉపాధి దిశగా వారిని ఉన్నతికి చేర్చేందుకు రంగం సిద్ధం చేసింది.. మహిళలు మీ శక్తిని చాటండి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్దేశించినట్లుగా కోటిని దాటి కోటీశ్వరులుగా వెలుగొందండి.. అంటూ మంత్రి శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. షాద్ నగర్ పట్టణంలోని రెడ్ రోజ్ గార్డెన్ లో మంగళవారం ఇందిరా మహిళా శక్తి కింద 3418 మంది మహిళా సంఘాలకు రూ.3.29 కోట్లు చెక్కుల రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇచ్చి వ్యాపార, కుటీర పరిశ్రమల దిశగా ప్రోత్సహించడం జరిగిందని, ఇప్పుడు మళ్లీ అలాంటి ప్రయోజనం కరమైన పథకాన్ని ఇందిరా శక్తి రూపంలో ప్రభుత్వం ముందుకు తెచ్చిందని గుర్తు చేశారు. మహిళలు విడివిడిగా వ్యాపారాలు చేసి గడ్డి పోచల్లా మిగిలిపోకుండా, కలిసికట్టుగా వ్యాపార రంగంలోకి వెళ్లి గడ్డిమోపులా మారాలని అప్పుడే వారి ఆర్థిక శక్తి బలంగా ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల జీవితాలను మార్చే ప్రయోజనకరమైన పథకాలని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకువస్తుందన్నారు. ఇందులో భాగంగానే మహిళలను పారిశ్రామిక రంగంలోనూ, వ్యాపార రంగాలలోనూ ముందుకు తీసుకెళ్లాలని దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు వెల్లడించారు. మహిళల కోసం గోదాముల నిర్వహణ, క్యాంటీన్లు, ఆర్టీసీ బస్సుల నిర్వహణ, పెట్రోల్ బంకుల నిర్వహణ లాంటి ఎన్నో కార్యక్రమాలను వ్యాపారాల రూపంలో చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది అన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోయినా తమ ప్రభుత్వం ప్రజల కోసం, ముఖ్యంగా మహిళల కోసం ఎంతో శ్రమిస్తుందని దీనిని అర్థం చేసుకొని మహిళలు తమకు ఆశీస్సులు అందించాలని పేర్కొన్నారు.

అప్పులు నెత్తిన రుద్దారు..

గత పాలకులు పదేళ్ల పాలనలో విద్యను పట్టించుకోలేదు, వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేశారు, మహిళల కోసం ఒక్క పథకం కూడా తీసుకురాలేదు.. కానీ కోట్లాది రూపాయలు అప్పులు మాత్రం చేశారని మంత్రి శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం తీసుకున్న అప్పులకు నెలకు ఏడు కోట్ల రూపాయల చొప్పున మిక్కిలిస్తున్నామని ఇంత చేసిన మహిళలను విస్మరించలేదని గుర్తు చేశారు. పదేళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని దుస్థితి గత ప్రభుత్వానిదని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం ఈనెల 25 నుంచే కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తుందని స్పష్టం చేశారు. రాబోయే సంవత్సర కాలంలో కోటి మంది మహిళలను సులువుగా కోటీశ్వరులను చేస్తామని ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం దశలవారీగా హామీలు నెరవేర్చుకుంటూ వస్తుందని, ఉచిత బస్సు, ఉచిత కరెంటు వంటివి ఇందులో భాగమే అన్నారు. త్వరలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని అన్నారు. తమ ప్రభుత్వం 98 రోజుల్లో 90 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా రూపంలో చెల్లించిందని స్పష్టం చేశారు. అంతకుముందు రైతు రుణమాఫీ కూడా చేయడం జరిగిందని అన్నారు. ప్రజా పాలన ద్వారా ప్రతి ఒక్కరికి పథకాలు వర్తించేలా కృషి చేశామని స్పష్టం చేశారు. షాద్ నగర్ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎంతగానో అభివృద్ధి చేస్తున్నాడని, అతనే నియోజకవర్గ ప్రజల భవిష్యత్తుకు భరోసా అన్నారు. ముఖ్యమంత్రితో కొట్లాడి అభివృద్ధి పనులను సాధించడంలో ఆయన ముందు వరసలో ఉంటారని స్పష్టం చేశారు.

సోలార్ ప్లాంట్ లు..

మహిళల కోసం కొత్తగా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ప్రభుత్వం కల్పిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ సోలార్ ప్లాంట్ల ద్వారా ఒక మెగావాటు విద్యుత్ తయారు చేస్తే కోటి రూపాయల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

ఇది తథ్యం.. ఇదే సత్యం: ఎమ్మెల్యే

కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయబోతున్నారు ఇది తథ్యం.. ఇదే సత్యం.. అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. అధికారంలోకి రాగానే ఉచిత బస్సులు, ఉచిత కరెంటు, చౌక ధరకు గ్యాస్ వంటి కార్యక్రమాలు మహిళల కోసమే చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పుడు మహిళల కోసం ప్రత్యేకంగా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో ప్రయోజనకరమని స్పష్టం చేశారు. తీసుకున్న డబ్బులు సక్రమంగా కడితే తిరిగి రుణాలు ఇవ్వడం జరుగుతుందని ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత కెసిఆర్ పాలనలో మహిళా శక్తి పూర్తిగా నిర్వీర్యమైందని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ అని చెప్పి బాతు గుడ్డు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నాయకులను నమ్మవద్దని, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ల ఆశయాలకు అనుగుణంగా ముందుకు నడిచే కాంగ్రెస్ పార్టీని మాత్రమే నమ్మాలని స్పష్టం చేశారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు వంటి కార్యక్రమాల ద్వారా ఇచ్చిన ప్రతి హామీని సీఎం నెరవేరుస్తున్నాడని ప్రశంసించారు. భవిష్యత్తులోనూ అన్ని వర్గాల ప్రజల కోసం చాలా కార్యక్రమాలను చేపట్టబోతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి స్థానిక నాయకులు మహిళా సంఘాల నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:
Pin Share