Headlines

ఘనంగా మహంకాళి బోనాలుఅమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

సికింద్రాబాద్‌, జూలై 13: సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారి జాతర సందర్భంగా శనివారం ఆలయంలో వైభవంగా కార్యక్రమాలు కొనసాగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవాలయానికి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. సంప్రదాయం మేరకు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి రేవంత్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

ఇందుకు తోడు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి బోనం సమర్పించారు. బోనాలను భక్తిశ్రద్ధలతో మోసుకుంటూ ఆలయానికి చేరుకున్న ఆమె, జాతర ఉత్సాహాన్ని మరింత పెంచారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రజలతో కలిసి సంప్రదాయ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని సీఎం రేవంత్ తెలిపారు. మహంకాళి అమ్మవారి కృపతో రాష్ట్ర ప్రజలు శాంతి, సౌభాగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు భద్రతా ఏర్పాట్లను ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

మహంకాళి జాతరలో భాగంగా ఆదివారం బోనం ఉత్సవాలు, సోమవారం రాంగం కార్యక్రమాలు జరగనున్నాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

Please follow and like us:
Pin Share